తెలుగు భాషకి మన ప్రభుత్వం ఏం చేసింది??? ఏం చేస్తుంది????

తెలుగు మనందరి మాతృభాష….ఈ తల్లి తెలుగు ఎన్నో ఏళ్ళు పరరాజుల పాలనలో మగ్గింది…..ఎన్నో పరభాషలు రాజభాషలుగా వెలిగి, మన భాషని కేవలం వాడుక భాషగా మిగిల్చాయి….మనదైన ఈ ప్రజాస్వామ్య రాజ్యం మనం కష్టపడి తెచ్చుకున్నాక, మనం పట్టం కట్టి కూర్చోబెట్టిన ఈ ప్రభుత్వాలు,ప్ర్జజాప్రతినిధులు చాలా మంది,మన తెలుగుతల్లికి అన్నిటా అగ్రతాంబూలం ఇస్తామని,ఇవ్వాలని ఎన్నో జీవోలు, మరెన్నో ప్రణాళికలు రూపొందించాయని వినికిడి……కానీ వాటిలో చాలా వరకు అసెంబ్లీ నాలుగ్గోడల మధ్యనే ఉండిపోయాయి….కొన్ని సచివాలయం దాకా వెళ్ళి ఫైళ్ళుగా మారి బీరువాల్లో మగ్గుతున్నాయి……నాకు తెలిసి తెలుగుకి అధికారభాషగా ఒక గుర్తింపు తెచ్చింది మన ఎన్టీయార్….ఆయన ఏం ప్రణాళికలు రూపొందించాడో, వాటిని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తుంగలో తొక్కి ఏ గంగలో కలిపాయో తెలియదు….నాకే కాదు, నేటి యువకులకి ఎవ్వరికీ తెలియదనుకుంటా…..

వాడుక భాషలో అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినప్పుడే, సమాచారం సగటు వ్యక్తికి సరిగ్గా చేరుతుంది….మాతృభాష వల్లే బుద్ధి వికాసం కలుగుతుందని విజ్ఞుల అభిప్రాయం…

పైగా పుట్టల్లా పెరిగిపోతున్న ఈ కార్పొరేట్ సంస్కృతిలో, మన తెలుగు భాషకి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ప్రతి తెలుగువాడూ నిలబడాలి…..కనుక పెద్దలు, విజ్ఞులైనవారు ఈ టపాకి స్పందించి, మన ప్రభుత్వం ఇంతవరకు  తెలుగు భాషాభివృధ్ధికి ఏఏ జీవోలు జారీ చేసింది, ఎలాంటి ప్రణాళికలు రూపొందించిందో సవివరంగా తెలియజేస్తే, మేం వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి, ఆ ప్రణాళికల అమలుకి మా వంతు ప్రయత్నం చేస్తాం….

ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడ, మా వద్ద ఉన్న కొన్ని ప్రశ్నల్ని మీ ముందుంచుతున్నాం….వాటి ఆధారంగా మీరు మీకు తెలిసిన విషయాల్ని పంచుకుంటారని ఆశిస్తున్నాం….

౧) అధికార భాషా సంఘం అని ఒకటుంది…దాని విధులు ప్రణాలికలు ఏంటి?

౨)తెలుగు భాషా ప్రచార సమితి అనే ప్రభుత్వ అనుబంధ సంస్థ ఉందనుకుంటా? దాని గురించి….

౩) అసలు ఇంతవరకూ చాలా ప్రభుత్వాలు మారాయి..అవి చేసిన చిన్న,పెద్ద ప్రణాళికలు…???

౪)ప్రభుత్వ కార్యాలయాలన్నిట్లో ఉత్తర, ప్రత్త్యుత్తరాలన్నీ తెలుగులోనే జరగాలని ఎన్టీయార్ ప్రభుత్వం జీవోలు జారీ చేసిన గుర్తు….దాని వివరాలు….

౫)ఇలా ఉత్తర, ప్రత్త్యుత్తరాలన్నీ తన కార్యాలయంలో, పూర్తిగా తెలుగులోనే జరిగేట్టు ఒక కలెక్టరుగారు చేస్తున్నారని వినికిడి……అలా ఆయన చెయ్యగలుగుతున్నపుడు రాష్ట్రం మొత్తం అలానే ఎందుకు చెయ్యకూడదు? దానికి ఆయన అనుసరిస్తున్న విధానాలు……..

౬) ఈ మధ్య “తెలుగు”కి  ప్రాచీన హోదా కల్పించామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హడావుడి చేశాయి….మన నాయకులు ఉపన్యాసాలు ఊదరగొట్టారు….మరి దానివల్ల “మన తెలుగు” కి ఎక్కువగా వచ్చే (ఒరిగే)దేంటి? దానిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఎంతెంత?…అసలేం చేస్తారు? మనమేం చెయ్యాలి?…..

ఇవండీ మాకున్న అనుమానాలు…..సహృదయులు, విజ్ఞులైన పెద్దలు ఈ విలువైన సమాచారాన్ని వ్యాఖ్యల రూపంలో పంచుకుంటారని ఆశిస్తున్నాం….పంచుకుని “మన తెలుగు” అభివృధ్ధికి మీ వంతు సహకారాన్ని అందిస్తారని భావిస్తున్నాం…..

ధన్యవాదాలు……

జై తెలుగుతల్లి!! జై తెలుగుతల్లి!!!


ఈటపా  నా అభ్యర్ధన మేరకు  కౌటిల్య గారు తెలుగులొ స్రిప్ట్   రాసి పంపించారు ,

ప్రకటనలు